Tata Nexon iCNG | కార్ల మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన పాపులర్ సబ్ కంపాక్ట్ ఎస్యూవీ నెక్సాన్ కారును ఐసీఎన్జీ వేరియంట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8.99 లక్షల (ఎక్స్ షోరూమ్)తో ప్రారంభం అవుతుంది.
ఈవీ వర్షన్, డార్క్ వేరియంట్లతోపాటు సీఎన్జీ వేరియంట్ నెక్సాన్ కారులో పలు అప్ డేట్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది. లాంగ్ రేంజ్ తో టాటా నెక్సాన్లో అప్ డేట్స్, డార్క్ వేరియంట్ కొనసాగింపుగా రెడ్ డార్క్ ఎడిషన్ ఆవిష్కరించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. టాటా నెక్సాన్ ఐసీఎన్జీ వేరియంట్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 100 హెచ్పీ, 170 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటది. కిలో సీఎన్జీపై 24 కి.మీ మైలేజీ ఇస్తుంది.
డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తున్న టాటా నెక్సాన్ ఐసీఎన్జీ కారులో 321 లీటర్ల బూట్ స్పేస్ ఉంటది. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ ప్రామాణికంగా వస్తున్నాయి. లార్జ్ పనోరమిక్ సన్ రూఫ్, 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ నేవిగేషన్ డిస్ ప్లే ఉంటుంది. ఎనిమిది వేరియంట్లలో ఈ కారు వస్తుంది.
సఫారీ, హారియర్ కార్ల మాదిరిగా టాటా నెక్సాన్ 2024 రెడ్ డార్క్ ఎడిషన్ కారు వచ్చింది. ఈవీ టాటా నెక్సాన్ ఈవీ కారు 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 489 కి.మీ ప్రయాణిస్తుందని టాటా మోటార్స్ చెబుతున్నా.. రియల్ వరల్డ్ రేంజ్ 350-370 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. దీని ధర రూ.13.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.