న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మొదలుకొని రూ.1.45 లక్షల వరకు తగ్గనున్నాయి. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది. జీఎస్టీతో తగ్గనున్న భారాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా వాహన ధరలు దించినట్టు టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. 1,200 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ మాడళ్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయం తీసుకున్నది. అలాగే ఆపై వాహనాలపై 40 శాతం జీఎస్టీని విధించనున్నది.