Tata Motors | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది టాటా మోటార్స్. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి లక్ష విద్యుత్ కార్లను విక్రయిస్తామని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. 2020-21లో కేవలం ఐదు వేల విద్యుత్ వాహనాలు, 2021-22లో 19,500 ఈవీలను విక్రయించామని సంస్థ 77వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 వేలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో లక్ష విద్యుత్ వాహనాలను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలోకి అడుగు పెట్టే యోచనేమీ లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేండ్లలో మొత్తం వాహనాల విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ కార్ల తయారీ కోసం 200 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని టాటా మోటార్స్ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే గతేడాది టీపీజీ ద్వారా రూ.3500 కోట్ల నిధులు సమకూర్చుకున్నామని, వచ్చే త్రైమాసికంలో మలి విడుత ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే టాటా మోటార్స్ ప్రతి నెలా 45 వేల వాహనాలు విక్రయిస్తున్నదని, తద్వారా ఈ ఏడాది ఐదు లక్షల వాహనాల మార్క్‌ను అధిగమిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌కు చెందిన సనంద్ యూనిట్‌ను టేకోవర్ చేయడంతో కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్లు, ఇతర వాహనాల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందన్నారు. టూ వీలర్స్ మార్కెట్లోకి వచ్చే ఆలోచనేమీ లేదన్నారు. టూ వీలర్స్‌తోపాటు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు చార్జింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని చంద్రశేఖరన్ వివరించారు.