హైదరాబాద్, జూలై 7: దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా ఏస్ ప్రొ ట్రక్కు ప్రారంభ ధర రూ.3.99 లక్షలు మాత్రమే. దేశీయంగా లభిస్తున్న అత్యంత చౌకైన మినీ ట్రక్కు ఇదే కావడం విశేషం.
మూడు రకాలు పెట్రోల్, బయో-ఫ్యూయల్(సీఎన్జీ+పెట్రోల్), ఎలక్ట్రిక్ విభాగాల్లో ఈ ట్రక్కును తీర్చిదిద్దింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఏ మాడల్నైనా ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సివుంటుందని టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాగ్ తెలిపారు. దేశీయ కార్గొ వాహన విభాగంలో ఈ వాహనం మైలురాయిగా మిగలనున్నదని వ్యాఖ్యానించారు. 750 కిలోల సరుకును తీసుకెళ్లే దీంట్లో పెట్రోల్ మాడల్‌ను 694 సీసీ ఇంజిన్‌తో తీర్చిదిద్దిన సంస్థ..ఎలక్ట్రిక్ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 155 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.