N Chandrasekaran | టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. ‘మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఈ మేరకు బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్ రాజు చార్లెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ, ఆతిథ్యం, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాల్లో యూకేతో బలమైన వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు.
జాగ్వార్, ల్యాండ్ రోవర్, టెట్లీ తదితర ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ల విషయంలోనూ తాము గర్వపడుతున్నామన్నారు. యూకేలో 70వేలకుపైగా మందికిగా ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ విశ్వవిద్యాలయం, స్వాన్సీ విశ్వవిద్యాలయంతో సహా ఈ దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప సంస్థలతో తాము ఫలవంతమైన, ప్రపంచ స్థాయి పరిశోధన, విద్యా భాగస్వామ్యాలను ఆస్వాదిస్తున్నామన్నారు. టాటా గ్రూప్ తరఫున, గ్రూప్‌కు మద్దతు ఇచ్చినందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరారు. జనవరి 2017లో చైర్మన్‌గా నియామకమయ్యారు.