న్యూఢిల్లీ : భారత్లో పలు ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. టాటా మోటార్స్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్ తాజా పెంపు మూడవ సారి కావడం గమనార్హం. పాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్టు ప్రకటించిన టాటా మోటార్స్ తాజా పెంపు ఎంత మేరకు ఉంటుంది, ఎప్పటి నుంచి ధరల పెంపు అమల్లోకి వస్తుందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అయితే ముడిపదార్ధాల వ్యయం పెరిగినందునే కార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ ప్రకటించింది. మరికొ్ది రోజుల్లోనే మోడల్స్ వారీగా ధరల పెంపును కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. స్టీల్ సహా పలు లోహాలతో పాటు ముడిపదార్ధాల ధరలు వరుసగా పెరుగుతుండటంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.