హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్‌కు 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీఎన్ జెన్కో ఎండీ ఎం గోవిందరావు..సింగరేణి సీఎండీ ఎన్ బలరాంను కలిసి చర్చలు జరిపారు. ఇందులో భాగంగా తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా ఉడింగిడిలో 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం ఏటా 2.88 మిలియన్ టన్నుల జీ-11 బొగ్గు అవసరమున్నదని టీఎన్ జెన్కో ఎండీ ప్రతిపాదించారు.
ఇందుకు సింగరేణి సీఎండీ సైతం సానుకూలంగా స్పందించారు. నైనీ బొగ్గుబ్లాకులో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో రైలు, జల మార్గంలో సరఫరా చేసేందుకు సూత్రాప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని నైనీ బ్లాక్ అధికారులను ఆదేశించారు. అలాగే తమిళనాడు జెన్కోకు బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేయాలని, 10 రోజుల్లోగా ఇంధన ఒప్పందం కుదుర్చుకొనేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్, మార్కెంటింగ్ అధికా రులకు దిశానిర్దేశం చేశారు.