న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: వచ్చే రెండేండ్లలో దాదాపు 45 శాతం భారతీయులు ఇల్లు మారాలనుకుంటున్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ చేపట్టిన సర్వేలో తేలింది. ఇక ఇందులో పాల్గొన్న 72 శాతం మిల్లేనియల్స్ అద్దె ఇంటి కంటే కొన్న ఇంటిలోకే వెళ్తామని చెప్పడం గమనార్హం. ‘వాయిసెస్ ఫ్రం ఇండియా: హౌ విల్ పీపుల్ లైవ్, వర్క్ అండ్ షాప్ ఇన్ ది ఫ్యూచర్?’ పేరుతో జరిగిన ఈ సర్వే రిపోర్టును సీబీఆర్ఈ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ గ్లోబల్ సర్వేలో 20వేల మందికిపైగా పాల్గొన్నారు. వీరిలో 18 ఏండ్లకు పైబడిన 1,500 మంది భారతీయులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నిజానికి నిరుడు సర్వేలో 31 శాతం భారతీయులే ఇల్లు మారాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఇది 44 శాతానికి పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగానైనా, ఆసియా-పసిఫిక్ రీజియన్లోనైనా ఇది చాలా ఎక్కువని సీబీఆర్ఈ అంటున్నది. ఇక 58 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్నవారితో చూస్తే 18-25 ఏండ్ల వయసున్నవారు ఇంటి కొనుగోలుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. దీంతో కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారే.. రాబోయే రెండేండ్లకుపైగా కాలంలో రెసిడెన్షియల్ మార్కెట్లో హౌజింగ్ డిమాండ్‌ను శాసిస్తారని సీబీఆర్ఈ అభిప్రాయపడింది. కాగా, 2016 సర్వేలో 68 శాతం మిల్లేనియల్స్ అద్దె ఇండ్లకే ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ఇప్పుడు అందుకు విరుద్ధమైన మార్పు కనిపిస్తున్నదని సంస్థ గుర్తుచేసింది. 42-57 ఏండ్లవారు నగరానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో నివసించాలని కోరుకుంటుండగా, కుదిరితే ఇతర దేశాల్లో స్థిరపడాలనీ చూస్తున్నారు. మిగతా వయస్కులు మాత్రం నగరానికి సమీపంలో నివసించడానికే ఇష్టపడుతున్నారని, అదికూడా అపార్టుమెంట్లలో ఫ్లాట్లను కొనాలనే భావిస్తున్నారని సీబీఆర్ఈ ఇండియా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్-ఆఫ్రికా విభాగం చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ ఈ సందర్భంగా తెలిపారు.