Gold | న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అక్షయ తృతీయ కొనుగోళ్లు అంచనాలను మించి జరిగాయి. అధిక ధరలున్నా బంగారం అమ్మకాలు బాగానే జరిగాయని జ్యుయెల్లర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విక్రయాల విలువ 35 శాతం పెరుగుతుందన్న అంచనాను అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) వ్యక్తం చేస్తున్నది. నిరుడు 20 టన్నుల మేర సేల్స్ జరిగాయి. నిజానికి గతకొద్ది రోజులుగా ధరలు పెరుగుతూపోవడంతో కొనేందుకు అంతా సందేహించారని, అయితే ఇప్పుడు రేట్లలో స్థిరీకరణ రావడంతో కస్టమర్లు దుకాణాలకు పెద్ద ఎత్తున వచ్చారని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోకెడె పీటీఐకి తెలిపారు. కాగా, గత ఏడాది అక్షయ తృతీయ రోజు (మే 10, 2024)న తులం బంగారం రూ.72,300గా ఉన్నది. అయితే ఇప్పుడిది రూ.98,550 పలికింది. అయినప్పటికీ కస్టమర్లు కొనేందుకే ముందుకురావడంపట్ల జ్యుయెల్లర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.
దాదాపు 12 టన్నుల బంగారం అమ్మకాలు జరుగవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య అంచనా వేస్తున్నది. దీని విలువ రూ.12,000 కోట్లుగా ఉండొచ్చని చెప్తున్నది. అలాగే రూ.4,000 కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరిగాయని భావిస్తున్నది. మొత్తంగా ఈ ఒక్కరోజే రూ.16,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగిందన్న సమాచారం తమకు అందుతున్నట్టు ట్రేడర్స్ పేర్కొంటున్నారు. ఇక ఉదయం సమయంలో దుకాణాల్లో కాస్త కస్టమర్ల సందడి తక్కువగానే ఉన్నా.. మధ్యాహ్నం నుంచి పుంజుకుందని, సాయంత్రం ఇంకా పెరిగిందని జ్యుయెల్లర్స్ తెలిపారు. చాలా నగరాల్లో అర్ధరాత్రిదాకా విక్రయాలు జరుగడం గమనార్హం.
వినియోగదారుల్లో 25-40 ఏండ్ల వయస్సువారు గోల్డ్, సిల్వర్ కడ్డీలు, నాణేలను కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపినట్టు నగల వ్యాపారులు వెల్లడించారు. అయితే బడ్జెట్, అవసరాన్నిబట్టి ఆభరణాలు, నాణేలు, కడ్డీలకు డిమాండ్ కనిపించినట్టు తెలియజేశారు. ఇక పాత బంగారు నగలు ఇచ్చి కొత్త బంగారం నగలను కొనుక్కునేవారు కూడా ఈసారి పెరిగారని, తమకు సుమారు 50 శాతం సేల్స్ అలాగే జరిగాయని పీఎన్జీ జ్యుయెల్లర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.
దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.98,550గా ఉన్నది. మంగళవారంతో పోల్చితే రూ.900 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండ్ ఇందుకు కారణంగా అఖిల భారత సరఫా అసోసియేషన్ పేర్కొంటున్నది. కాగా, కిలో వెండి ధర ఏకంగా ఈ ఒక్కరోజే రూ.4,000 దిగింది. రూ.98,000కు పరిమితమైంది. అంతర్జాతీయంగా చూస్తే.. స్పాట్ మార్కెట్లో ఔన్స్ 3,273.90 డాలర్లు పలికింది. 43.35 డాలర్లు తగ్గుముఖం పట్టింది. వెండి కూడా 32.33 డాలర్లుగానే ఉన్నది. ఇదిలావుంటే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం రూ.97,910గా ఉన్నది. రూ.60 తగ్గింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి రేటు రూ.50 దిగి రూ.89,750గా ఉన్నది.
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి డిమాండ్ పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) బుధవారం తెలిపింది. నిరుడుతో పోల్చితే పసిడికి 15 శాతం ఆదరణ క్షీణించినట్టు తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ 3 నెలల్లో గరిష్ఠంగా 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.94,030 పలికింది. ఈ క్రమంలోనే 118.1 టన్నులకే గోల్డ్ డిమాండ్ పరిమితమైంది. కాగా, ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా పుత్తడి రేట్లు భారతీయ మార్కెట్లో 25 శాతం పుంజుకున్నాయి. తులం లక్ష రూపాయల మార్కునూ దాటేసింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం దేశీయంగా గోల్డ్ డిమాండ్ 700-800 టన్నుల మధ్య ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేస్తున్నది. రాబోయే పెండ్లిళ్ల సీజన్ కలిసిరావచ్చన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ వ్యక్తం చేశారు. అయితే అధిక ధరల వల్ల కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని, తేలికపాటి నగల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు చెప్తున్నారు.