EPFO | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రిటైర్డు ఉద్యోగులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అర్హులైనవారికి అధిక పింఛన్‌పై పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి సరిగ్గా ఏడాది అవుతున్నా నరేంద్ర మోదీ సర్కార్‌లో చలనం కలగడం లేదు.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మొక్కుబడిగా ఈపీఎఫ్‌వో దరఖాస్తులు స్వీకరించి చేతులు దులిపేసుకున్నది. తదుపరి చర్యలు చేపట్టడంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేస్తామని జాతీయ స్థాయిలో ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి.
దేవుడు వరమిచ్చినా కరుణించలేదు..
అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఏండ్ల తరబడి చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగా ఎట్టకేలకూ గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే అర్హులైన కార్మికులు, ఉద్యోగులకు అధిక పింఛను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అధిక పింఛన్‌కు అర్హులైనవారి నుంచి ఈపీఎఫ్‌వో దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలించి, అధిక పింఛన్ చెల్లించడానికి చర్యలు చేపట్టాల్సిన ఈపీఎఫ్‌వో.. మార్గదర్శకాల పేరిట అనేక కొర్రీలు పెట్టింది.
ఆ మార్గదర్శకాలు పెన్షనర్లకు అధిక పింఛన్‌ను ఏ విధంగానైనా ఎగ్గొట్టే విధంగా ఉన్నాయని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మొదట జారీ చేసిన నిబంధనలను మార్పు చేయడంతోపాటు దరఖాస్తుల స్వీకరణకు గడువు కూడా పెంచింది. ఆ తర్వాతైనా అధిక పింఛన్ అమల్లోకి వస్తుందని పెన్షనర్లు గంపెడాశ పెట్టుకున్నా, ఇప్పటికీ ఎటూ తేల్చకుండా తాత్సారం చేయడంపట్ల కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినా కేంద్ర నుంచి ఉలుకూ పలుకూ లేదు.
33 వేల మందికి నోటీసులు
అధిక పింఛన్‌దారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైనప్పటికీ ఈపీఎఫ్‌వో నుంచి స్పష్టత లేకపోవడం వల్లనే వాటిని పరిష్కరించలేకపోతున్నట్టు ప్రాంతీయ కార్యాలయాలు వాపోతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక పింఛన్ కోసం 17.48 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..వీరిలో 32,951 దరఖాస్తుదారులకు మాత్రమే అదనంగా చెల్లించాల్సిన మొత్తానికి డిమాండ్ నోటిసులు జారీ చేసింది. అందిన దరఖాస్తులలో ఇది కేవలం 1.8 శాతం మాత్రమే. అధిక పింఛన్‌కు అర్హత పొందడానికి ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.1,974 కోట్లుగా అంచనావేసింది. డిమాండ్ నోటీసులు అందుకున్న వారిలో కొందరు అదనపు మొత్తాన్ని కూడా చెల్లించినప్పటికీ పింఛన్ గణనపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం తదుపరి చర్యలు చేపట్టలేకపోతున్నట్టు ప్రాంతీయ కార్యాలయాలు చెబుతున్నాయి.
అంతా గందరగోళం
అధిక పింఛన్‌కు అర్హత కలిగిన ఉద్యోగులు ఈపీఎఫ్ చందాను మూలవేతనంతో డీఏ కలిపి మొత్తంగా 8.33 శాతాన్ని లెక్కించాల్సి ఉండగా ఈపీఎఫ్‌వో మాత్రం 9.49 శాతం చెల్లించాల్సి ఉంటుందని నోటిఫీకేషన్లో పేర్కొంది. ఇది ఫించన్‌దారులకు పెనుభారంగా మారుతున్నది. అయినప్పటికీ పింఛన్ లెక్కింపు విధానానికి కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి అఫిడవిట్ తీసుకోవడం వల్ల ఖరారు చేసిన మేరకు అధిక మొత్తం చెల్లించడానికి కూడా ఉద్యోగులు అంగీకరించారు.
ఇలా ఉండగా ప్రాంతీయ కార్యాలయాలు పార్ట్-1, పార్ట్-2 విధానానికి తెరపైకి తీసుకరావడంతో గందరగోళానికి దారితీసింది. దీనిపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఈ విధానం సరికాదని, ప్రభుత్వానికి అధిక పింఛన్ చెల్లించే ఉద్దేశం లేకనే మొదటి నుంచి అనేక కొర్రీలు పెడుతుందని ధ్వజమెత్తాయి. ఈపీఎఫ్‌వో నుంచి స్పష్టత వచ్చాకే దరఖాస్తులను పరిష్కరించగలమని ప్రాంతీయ కార్యాలయాలు చేతులు ఎత్తేసాయి.
13 లక్షల మందికి దెబ్బ
ఈపీఎఫ్‌వో తాజా నిర్ణయంతో అధిక పింఛన్‌ను ఆశిస్తున్నవారికి పెద్ద దెబ్బే తగిలింది. అధిక పింఛన్ కోసం అప్షన్ ఇచ్చిన దరఖాస్తుదారులలో ఏకంగా 13 లక్షల మందికి చెల్లించాల్సిన మొత్తంలో మూడో వంతు కోత పడనుంది. సెప్టెంబర్ 1, 2014 తర్వాత రిటైరైన ఉద్యోగులతోపాటు ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. అధిక పింఛన్ చెల్లించడానికి సదరు ఉద్యోగుల వేతనంలో రిటైర్మెంట్ ముందటి 60 నెలల సగటు వేతనాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది గత విధానానికి భిన్నం. రిటైర్ కావడానికి ముందు అధిక వేతనం పొందిన ఉద్యోగులకు పూర్తి పెన్షన్ పొందడానికి అర్హులు కాదని ఈపీఎఫ్‌వో తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.