Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకొన్నది. అదానీ కంపెనీల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి తాను సాక్షినని సుప్రీంకోర్టులో మంగళవారం ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. సెబీ-అదానీ దర్యాప్తులో తనను భాగం చేస్తే అన్ని వివరాలు చెబుతానని ఈబీపీఎల్ వెంచర్స్ డైరెక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన సర్గుజా రైల్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ తమ కంపెనీకే దక్కిందని పేర్కొన్న పిటిషనర్.. అదానీ సబ్సిడరీ కంపెనీల మధ్య లావాదేవీలు ఎలా జరిగాయన్న విషయాలు తనకు లోతుగా తెలుసునని వెల్లడించారు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసం కోర్టు అనుమతిస్తే.. ఆయా విషయాలను వెల్లడిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, 2014 జనవరిలో అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిప్యులేషన్‌కు పాల్పడినట్టు డీఆర్ఐ నుంచి సమాచారం అందినప్పటికీ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆ విషయాన్ని దాచిపెట్టిందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల ఓ పిటిషనర్ అఫిడవిట్ దాఖలు చేయడం తెలిసిందే.