Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. నూతన సంవత్సరంలో వరుసగా రెండోరోజు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. వచ్చే వారం కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఆటో, ఐటీ, ఫైనాన్స్ సెక్టార్‌లోని షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఉదయం సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 78,657.52 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,542.37 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 80,032.87 పాయింట్ల మార్క్‌ని అధిగమించింది. చివరకు 1,436.30 పాయింట్ల లాభంతో 79,943.71 వద్ద స్థిరపడింది.
ఇక నిఫ్టీ సైతం 445.75 పాయింట్లు పెరిగి.. 24,188.65 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2312 షేర్లు పెరగ్గా.. 1,496 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, శ్రీరామ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం చొప్పున పెరిగాయి. అన్నిరంగాల సూచీలు ఆటో ఇండెక్స్ 3.5శాతం, ఐటీ ఇండెక్స్ 2శాతం పెరిగాయి. ఇక మరో వైపు అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి.. 85.75 పడిపోయింది.