Stocks | 359 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
జీడీపీ గణాంకాల ముందు అప్రమత్తత
ముంబై, మే 31: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడం, యూరోపియన్ ఈక్విటీలు బలహీనంగా ట్రేడ్ అవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడు రోజుల్లో భారీగా లాభపడిన దేశీయ ఈక్విటీలు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ గణాంకాలు విడుదలకానుండటంతో మదుపరులు ముందస్తు అప్రమత్తతకు మొగ్గుచూపారు. దీనికి తోడు రూపాయి డీలా పడటం కూడా మదుపరుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 359.33 పాయింట్లు తగ్గి 55,566.41 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 55,925 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఒక దశలో 55,369 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 76.85 పాయింట్లు తగ్గి 16,584.55 వద్ద ముగిసింది.