ముంబై: స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 628.04 పాయింట్లు లేదా 0.82 శాతం పెరిగి 77,537.72 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 701.43 పాయింట్లు పుంజుకున్నది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 153.55 పాయింట్లు లేదా 0.64 శాతం అందుకొని 24,231.85 వద్ద స్థిరపడింది. దీంతో గత 7 రోజుల నష్టాలకు తెరపడినైట్టెంది. బాండ్ మార్కెట్ రాబడులకు కళ్లెం వేసేలా అమెరికా అడుగులు వేయడం.. ఈక్విటీ మార్కెట్ వైపునకు మదుపర్లను నడిపించిందని మెజారిటీ నిపుణులు తాజా మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ నిలదొక్కుకుంటుండటం కూడా కలిసొచ్చిందని చెప్తున్నారు. కాగా, సెన్సెక్స్ షేర్లలో ఎటర్నల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు మదుపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ కూడా 0.83 శాతం, మిడ్‌క్యాప్ 0.56 శాతం పెరిగాయి. రంగాలవారీగా.. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆర్థిక సేవలు షేర్లు లాభపడ్డాయి. ఇక ఆసియా ప్రధాన మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి.