ముంబై, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదుకావడంతో సూచీలు అమ్మకాలు ఒత్తిడికి గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్పొరేట్లు నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలుండటంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలకు తోడు, విదేశీ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. వరుసగా రెండోరోజు 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 78 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 1,441 పాయింట్లు నష్టపోయి 77,781 పాయింట్ల వద్దకు చేరుకున్న సూచీ చివరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. మార్కెట్ ముగిసే సమయానికి 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం నష్టపోయి 77,964.99 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ కూడా 24 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గత కొన్ని రోజులుగా లాభాలతో కళకళలాడిన మదుపరుల్లో ఉత్సాహం వైరస్ దెబ్బకు ఆవిరైపోయింది. దీంతో అమ్మకాల బటన్ నొక్కడంతో సోమవారం ఒకేరోజు 10 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. సూచీల భారీనష్టంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.10,98,723.54 కోట్లు కరిగిపోయి రూ.4,38,79,406.58 కోట్లు(5.11 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.