Stock markets : భారత స్టాక్ మార్కెట్ (Stock markets) లు వరుసగా నాలుగోరోజు కూడా లాభాల బాటలో పయనించాయి. ఇవాళ్టి ట్రేడింగ్ (Trading) లో సూచీలు సానుకూలంగా ముగిశాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC bank), భారతీ ఎయిర్టెల్ (Bharati Airtel) లాంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) 136 పాయింట్ల లాభంతో 81,926 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ (Nifty) 30.65 పాయింట్లు పెరిగి 25,108.3 వద్ద ముగిసింది. కీలకమైన 25 వేల మార్కుపై నిఫ్టీ నిలదొక్కుకోవడం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మార్కెట్ కొద్దిగా పతనమైన ప్రతిసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ నిపుణులు తెలిపారు. బ్రాడర్ మార్కెట్లు కూడా రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.47 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.31 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇది మార్కెట్లలో మొత్తం మీద కొనుగోళ్ల ధోరణి బలంగా ఉందని చూపిస్తోంది.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ రియల్టీ సూచీ 1.09 శాతం లాభంతో అందరికంటే ముందుంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. అయితే FMCG, PSU Bank, Media, Metal, IT రంగాల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిశాయి.