ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగాయి. 30 షేర్ల బీఎన్‌ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి, చివరకు 55,926 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్తీ 309 పాయింట్లు లాభపడి, 16,661 వద్ద స్థిరపడింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల కారణంగా భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాల్లో కొనసాగాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 2,371 షేర్లు పురోగమించగా, 1,058 షేర్లు క్షీణించాయి.
154 షేర్లలో తేడాలు కనిపించలేదు. నిఫ్టీలో 4.95శాతం పెరిగి ఎంఅండ్ఎం టాప్ గెయినర్‌గా నిలిచింది. 30 షేర్ల బీఎస్ఈ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ లాభాల్లో కొనసాగాయి. ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు 1.89 శాతం పెరిగి.. రూ.837.05కి చేరింది. దీనికి విరుద్ధంగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ నష్టాల్లో కొనసాగాయి.