Stock markets : భారత స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా ఆరోరోజూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల (IT shares) లో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు గురువారం కూడా లాభాలతో ముగిశాయి. అయితే ట్రేడింగ్ చివరలో లాభాల స్వీకరణ జరగడంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సూచీలు కిందకు దిగొచ్చాయి.
ఇవాళ్టి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 864 పాయింట్ల వరకు లాభపడి 85,290 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. కానీ చివరికి 130 పాయింట్ల స్వల్ప లాభంతో 84,556 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 26,104 స్థాయికి చేరినప్పటికీ చివరకు కేవలం 23 పాయింట్ల లాభంతో 25,891 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది. ఉదయం వచ్చిన లాభాలను నిఫ్టీ పూర్తిగా కోల్పోయింది.
ఐటీ రంగ షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. ఇన్ఫోసిస్ ప్రమోటర్లు రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో పాల్గొనబోమని ప్రకటించడంతో ఆ సంస్థ షేరు ఏకంగా 4 శాతం పెరిగింది. దీనికి తోడు భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న వార్తల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు కూడా రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.2 శాతం పెరిగింది.
లాభపడిన ఇతర షేర్లలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్ ఒక శాతానికి పైగా వృద్ధిచెందాయి. మరోవైపు ఎటర్నల్ 3 శాతంతో టాప్ లూజర్‌గా నిలువగా, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 1 నుంచి 2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే బ్రాడర్ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగానే ఉంది.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న ఆశలతో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే 19 పైసలు లాభపడి 87.82 వద్ద స్థిరపడింది.