ముంబై, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్లకు అమెరికా సెగ గట్టిగానే తాకింది. భారత్ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం ప్రతీకార సుంకాన్ని విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 81 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 848.37 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టపోయి 80,786.54 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 255.70 పాయింట్లు లేదా 1.02 శాతం నష్టపోయి 24,712.05 వద్దకు జారుకున్నది. ఇంట్రాడేలో 278 పాయింట్లు నష్టపోయింది. ఔషధ ధరలను 1,500 శాతం వరకు తగ్గించాలని ఫార్మా కంపెనీలకు ట్రంప్ సూచించడంతో ఫార్మా రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
వడ్డీరేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వు చైర్మన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తేవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను తరలించుకుపోతున్నారు. ప్రస్తుత ఆగస్టు నెలలోనే రూ.30 వేల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు..మొత్తం ఈ ఏడాదిలో రూ.70 వేల కోట్లకు పైగా నిధులను తరలించుకుపోయారు.
స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక్క శాతానికి పైగా నష్టపోవడంతో మదుపరులు రూ.5 లక్షల కోట్లకు పైగా సంపద కర్పూరంలా కరిగిపోయింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.5,41,542.83 కోట్లు కరిగిపోయి రూ.4, 49,45,420.62 కోట్లు (5.12 ట్రిలియన్ డాలర్లు) కు పడిపోయింది.