ముంబై, మే 27: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 624.82 పాయింట్లు కోల్పోయి 81,551.63 వద్ద స్థిరపడింది. 30 సూచీల్లో 25 షేర్లు నష్టపోగా, కేవలం ఐదు సూచీలు లాభపడ్డాయి.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 174.95 పాయింట్లు కోల్పోయి 24,826.20 వద్ద స్థిరపడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి. దీంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయి, చివర్లో భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి.
పారిశ్రామి, తయారీ రంగ గణాంకాల విడుదలకుముందు మదుపరులు ముందస్తుగా అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీల నష్టాలకు ప్రధాన కారణమని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం పారిశ్రామిక, తయారీ రంగ గణాంకాలతోపాటు ఈ వారం చివర్లో దేశ జీడీపీ గణాంకాలు కూడా విడుదలకానున్నాయి. సూచీల్లో అల్ట్రాటెక్ సిమెంట్ గరిష్ఠంగా 2.21 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు ఐటీసీ 2 శాతం, టాటా మోటర్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు నష్టపోయాయి.