Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ ట్రెండ్ సంకేతాలు కనిపిస్తున్నా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ లాంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచింది. ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ ఉదయం 85,259.36 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 85,188.60) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,812.27 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 573.41 పాయింట్ల లాభంతో 85,762.01 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరికి 182 పాయింట్ల లాభంతో 26,328 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ 90 మార్కు దాటి 90.20కి చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 60.82 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4,387 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.