ముంబై, ఆగస్టు 11 : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. చమురు, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టడం సూచీల్లో జోష్ పెంచింది. ఫలితంగా ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 80 వేల మైలురాయిని అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 746 పాయింట్లు ఎగబాకి 80,604.08 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 221.75 పాయింట్లు అందుకొని 24,585.05 వద్ద స్థిరపడింది.
మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన మార్కెట్లకు కాస్ల రిలీఫ్ ర్యాలీ వచ్చిందని, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రోత్సహించిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో టాటా మోటర్స్, ఎటర్నల్, ట్రెంట్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు అత్యధికంగా లాభపడగా..భారత్ ఎలక్ట్రాక్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ 1.86 శాతం, బ్యాంకింగ్ 1.13 శాతం, హెల్త్‌కేర్ 1.12 శాతం, ఆటో 1.03 శాతం, ఆర్థిక సేవలు 1 శాతం, యుటిలిటీ, సర్వీసెస్, పవర్ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు నష్టపోయాయి.