ముంబై, నవంబర్ 11 : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఐటీ, సర్వీసెస్, టెలికాం రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడం, అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు అయ్యే అవకాశాలుండటం కూడా సూచీల్లో జోష్ పెంచింది. ప్రారంభంలో 411 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 335.97 పాయింట్లు అందుకొని 83,871.32 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 120.60 పాయింట్లు అందుకొని 25,694.95 వద్ద నిలిచింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడి నేపథ్యంలో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది..ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ప్రారంభంలో తీవ్రంగా నష్టపోయిన సూచీలు చివర్లో గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి లాభాల్లోకి వచ్చాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఐటీ, వాహన, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కదంతొక్కాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎటర్నల్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మాస్యూటికల్స్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు అత్యధికంగా 7 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది.