న్యూఢిల్లీ, మే 25: అంతర్జాతీయ ట్రెండ్ పాజిటివ్‌గా ఉన్నా, వరుసగా మూడో రోజు సైతం భారత్ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగి 54,380 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరింది. అటుతర్వాత ఐటీ, మెటల్, వినియోగ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో సెన్సెక్స్ చివరకు 303 పాయింట్ల నష్టంతో 53,749 పాయింట్ల వద్ద నిలిచింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 16,223 పాయింట్ల గరిష్ఠాన్ని చేరిన అనంతరం 99 పాయింట్లు క్షీణించి 16,026 పాయింట్ల వద్ద ముగిసింది. పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ ఫండ్స్ విక్రయాలు మార్కెట్లను ఒత్తిడిలో పడేశాయని విశ్లేషకులు చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ పాలసీ కఠినతరంకానున్నందున, ఆ దేశంలో మాంద్యం వచ్చే అవకాశాలున్నాయన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.