ముంబై, అక్టోబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించినదానికంటే తక్కువ స్థాయిలో నమోదుకావడంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇరు సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 566.96 పాయింట్లు లాభపడి 84,778.84 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ 170.90 పాయింట్లు ఎగబాకి 25,966.05 వద్ద ముగిసింది. వాణిజ్య ఒప్పందాలపై అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం మార్కెట్లలో జోష్ పెంచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
సూచీల్లో భారతీ ఎయిర్టెల్ షేరు 2.56 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు రిలయన్స్, ఎటర్నల్, ఎస్బీఐ, టాటా మోటర్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, మారుతి, టీసీఎస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
కానీ, కొటక్ బ్యాంక్, బీఈఎల్, ఇన్ఫోసిస్, అదానీపోర్ట్స్, మహీంద్రాఅండ్ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా టెలికాం రంగ షేరు అత్యధికంగా 2.37 శాతం ఎగబాకింది. దీంతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ 1.50 శాతం, ఎనర్జీ 1.44 శాతం, రియల్టీ 1.42 శాతం, టెక్నాలజీ, కమోడిటీస్, సర్వీసెస్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి.