Stock Market : భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు పెరగగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగింది. దీంతో నాలుగు రోజులుగా సాగిన నష్టాలకు శుక్రవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 531.88 పాయింట్ల పెరుగుదలతో 76,684.74 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 78.25 పాయింట్ల పెరుగుదలతో 23,951.70 వద్ద ప్రారంభమైంది.
చివరకు సెన్సెక్స్ 362.57 పాయింట్ల లాభంతో 76,515.43 వద్ద, నిఫ్టీ 24.25 పాయింట్ల లాభంతో 23,897.70 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 విలువ 0.25 శాతం నష్టపోగా, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 కూడా 0.67 శాతం నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 0.90 శాతం పడిపోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.07 శాతం పెరిగింది. 30 షేర్ బీఎస్ఈ ఇండెక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతి నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 95.52 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్స్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 4,472 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.49 వద్ద ఉంది. మరోవైపు ఆసియన్ మార్కెట్లు కూడా ఈ రోజు లాభాల్లోనే ముగిశాయి. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి అడ్వాన్సుడ్ 1.3 శాతం, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 1.11 శాతం, షాంగై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ 0.35 శాతం లాభపడ్డాయి. అమెరికన్ మార్కెట్లు కూడా 1 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.