హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఏపీలో సచివాలయ ఉద్యోగుల నిరసన ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా గళమెత్తిన ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపింది. అధికార అండతో పోలీసులను ప్రయోగించి అణచివేయాలని చూడగా.. లాఠీచార్జ్‌లు, అరెస్టులతో విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం అన్ని జిల్లాల నుంచి వేలాదిగా నగరానికి తరలిరాగా, ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడుగడుగునా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల కండ్లు గప్పి తప్పించుకొని లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
దీంతో ఉద్యోగులు రోడ్లపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రోడ్లపై బైఠాయించిన ఉద్యోగులను బలవంతంగా లాకెళ్లడమే కాకుండా, మహిళా సిబ్బందిని సైతం ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎకించి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు గాయపడగా, పోలీసుల తీరుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం లిఖితపూర్వక స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఏడేండ్లుగా నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిలు విడుదల చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని, క్షేత్రస్థాయిలో అధిక పనిభారం తగ్గించి ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై లాఠీచార్జ్, అక్రమ అరెస్టులను ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హకును కాలరాయడం సరికాదని వారు మండిపడ్డారు. మరోవైపు, సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నదని అధికార వర్గాలు తెలిపినప్పటికీ, నగరంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ధర్నా చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు.
ఆందోళనలపై స్పందించిన మంత్రి డీఎస్ బీవీ స్వామి, సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్‌ను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్టు వెల్లడించారు. పాత బకాయిలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రభు త్వం వేగవంతం చేస్తున్నదని, కొందరు రాజకీయ లబ్ధి కోసమే వారిని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.