మేడ్చల్, సెప్టెంబర్27(నమస్తే తెలంగాణ): చేయూత పింఛన్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తారా అన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నది. నిబంధనల పేరిట అర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తారా అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. చేయూత పింఛన్లను కాంగ్రెస్ లీడర్లు అనుకున్న వారికే మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అసలైన వారికి పింఛన్లు అందే అవకాశం సన్నగిల్లుతున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి చేయూత పింఛన్లకు 31,499 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ఈనెల 30 వరకు జరగనున్నది. అధికారులు కాంగ్రెస్ లీడర్ల ఒత్తిడి గురికాకుండా అర్హులైన దరఖాస్తుదారులను పారదర్శకంగా గుర్తించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ప్రస్తుతం వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు మాత్రమే చేయూత పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది. పింఛన్ల దరఖాస్తుల పరిశీలనకు 164 మంది సర్వే అధికారులను నియమించారు. దరఖాస్తుదారులు తెలుపు రేషన్ కార్డు లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
మూడేైండ్లెనా పింఛన్ల పెంపు ఊసే లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పింఛన్లను డబుల్ చేస్తామని ఇచ్చిన హామీ ఏ మైందని పింఛన్దారులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్ల్లు దగ్గర పడుతున్న పింఛన్లను పెంపుపై ఉసే తీయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అందిస్తామని చెబుతున్న చేయూత పింఛన్లలో వృద్ధ్దాప్య పింఛన్ల దరఖాస్తులు స్వీకరించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
తమకు 62 ఏండ్లు దాటుతున్న వృద్ధ్దాప్య పింఛన్ కోసం దరఖాస్తులు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 1,40,999 మందికి ప్రతి నెలా రూ. 34 కోట్లను పింఛన్దారులకు అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అర్హులను గుర్తించి పింఛన్లను అందజేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని, దీనికి ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు కేటాయింపే నిదర్శనంగా కనపుడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి.