హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ) : సర్కార్ పెద్దలు 30 శాతం కమీషన్లతో రియల్ ఎస్టేట్ వ్యవస్థను దెబ్బతీశారని, ఆ రంగాన్ని ప్రభుత్వం కుప్పకూల్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరినవారిలో కాంగ్రెస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బీ సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ, మారెట్ కమిటీ డైరెక్టర్ బీ రాజు, మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేశ్, పుప్పాలగూడ మాజీ ఎంపీటీసీ పాపాలాల్ సింగ్, మణికొండ మాజీ సర్పంచ్ జైహింద్ రావు, మణికొండ కౌన్సిలర్ యాలాల లావణ్య ఉన్నారు. దాదాపు 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన వారంతా బీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మళ్లీ కేసీఆరే సీఎం
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మరో రెండేండ్లలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని స్పష్టంచేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని, ఎవరు ఎకడ ఏం చేస్తున్నారో తమకు తెలుసని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని లెకలూ బయటకు తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు ఎప్పుడో వచ్చి ఉండేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో మెట్రోకు సంబంధించిన టెండర్ పూర్తిచేశామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఆ టెండర్‌ను రద్దు చేయడమేనని మండిపడ్డారు. హైడ్రాకు వివేక్ వెంకటస్వామి, అనుముల తిరుపతిరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఇండ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
‘గ్రాడ్యుయేట్’ ఓటు నమోదు చేసుకోవాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందని, అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ అని భావించి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని భావించే నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.