సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాంబాగ్ మైదానం వద్ద ట్రాన్స్ఫార్మర్ గత వారం పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తినష్టం జరగకున్నా ట్రాన్స్ఫార్మర్ పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పదిరోజుల క్రితం మేడ్చల్ సర్కిల్ బహదూర్‌పల్లిలో టెక్‌మహీంద్ర మార్గంలో విద్యుత్ తీగలు తెగిపడి రెండు గేదెలు మృతి చెందాయి. లాలాగూడలోని కాలనీలో విద్యుత్ తీగలు వదులుగా ఉన్నాయని స్థానికులు విద్యుత్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోకపోలేదు. గతవారం తీగలు తెగిపడడంతో కాలనీవాసులు ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. బస్తీబాటలో ఈ సమస్యలన్నీ స్థానికులు సిబ్బందికి చెప్పినా వారి నుంచి స్పందన లేకపోవడంతో ప్రమాదాలు జరిగాయి.
తెగిపడుతున్న విద్యుత్ తీగలు, స్తంభాలపై ప్రతీ కాలనీలో మంటలు, అక్కడక్కడ పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లు, గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం.. ఇటీవల నగరంలో ప్రతీ కాలనీలో, బస్తీలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. విద్యుత్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని నగరవాసులు ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో వినియోగదారులకు ఎదురయ్యే అనుభవాలు, తమ కాలనీల్లో ఉన్న సమస్యలను విద్యుత్ అధికారులకు తెలిపే దిశగా ఉపయోగపడుతుందనుకున్న బస్తీబాట పేలవంగా మారిపోయిందని వారు చెప్పారు.
ఆగస్టు 6వ తేదీన బస్తీబాట-ప్రజాబాట పేరుతో టీజీఎస్పీడీసీఎల్ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పర్యటనలు ప్రారంభించారు. వారంలో ప్రతీ మంగళవారం, గురువారం రెండురోజుల పాటు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు క్షేత్రస్థాయి బస్తీబాట పర్యటనలు చేస్తున్నారు. బస్తీబాటలో లోవోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, విద్యుత్ తీగలు, స్తంభాలు, చెట్లకొమ్మలు, కొత్త కనెక్షన్లు, బిల్లింగ్, పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరిస్తామని డిస్కం అధికారులు చెప్పారు. ప్రతీ ఫిర్యాదును సంబంధిత ఇంజినీర్లు పర్యవేక్షిస్తారని సీఎండీ జితేష్ పాటిల్ ప్రకటించారు. అయితే ఈ పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయని డిస్కం అధికారులు ప్రకటించుకుంటుంటే నగరంలోని పలు కాలనీల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటున్నాయి.
సిబ్బంది మొక్కుబడిగా బస్తీబాట నిర్వహిస్తున్నారనే విమర్శలు ప్రజల నుంచి వినపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై స్పార్క్‌తో మంటలు వస్తున్న ఘటనలపై పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో తీగలు వదులుగా ఉండి స్పార్క్ వస్తున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. కరెంట్ సమస్యలపై ఆదివారం సాయంత్రం 7గంటల వరకు 200 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో 1912, ఐవీఆర్ ద్వారా 116, యాప్ ద్వారా 59 ఫిర్యాదులు వచ్చినట్లు పవర్ ఔటేజ్ గ్రీవెన్స్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో హైదరాబాద్ సౌత్ సర్కిల్లో అత్యధికంగా 51 ఫిర్యాదులు నమోదయ్యాయి.
విద్యుత్ తీగలకు ఎక్కడ చూసినా చెట్ల కొమ్మలు తాకుతున్నాయి. వర్షం పడినప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడానికి ఇవే కారణమవుతున్నాయి. బస్తీబాట పర్యటనలో సిబ్బందికి ఈ చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తగిలే విషయం కనిపించినా వాటిని తొలగిస్తామని చెప్పి వెళ్లిపోయి కొన్ని చోట్ల మమ అనిపించారు తప్పా పూర్తి స్థాయిలో ఎక్కడా పనులు జరగలేదు. వినాయక నవరాత్రుల్లో చాలాచోట్ల చెట్ల కొమ్మలు కొట్టేసినట్లు చెప్పినా ఇంకా నగరంలో విద్యుత్ తీగలు అదే పరిస్థితిలో ఉన్నాయంటూ ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ లైన్ల వెంట నడుస్తూ బస్తీబాట నిర్వహించే క్రమంలో అక్కడి సమస్యలు వారే గుర్తించాల్సి ఉన్నప్పటికీ అలా జరగకపోగా స్థానికులు తమ సమస్యలు చెబితే విని పరిష్కరిస్తామంటున్నారు తప్పా నెలల తరబడి ఆ సమస్య అలాగే ఉండిపోతుందని నగరవాసులు చెబుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం, ముందస్తు నిర్వహణ చాలా చోట్ల ప్రమాణాల మేరకు జరగకపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కరెంట్ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
నగరంలో చాలాచోట్ల డీటీఆర్లు టపాసుల్లా పేలిపోతున్నాయి. ఎల్‌నినో కారణంగా ఇటీవల విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ గత ఆరునెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా తమ లక్ష్యమని, ఆ దిశగా బస్తీల్లో, కాలనీల్లో ప్రజలకు ఎదురయ్యే విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటైన బస్తీబాట డీటీఆర్‌ల నిర్వహణలో పాలతో నగుబాటు అయింది. పేలిన డీటీఆర్‌ల సంఖ్య వేలల్లోనే ఉండగా వాటిని రీప్లేస్ చేయడానికి స్టోర్‌లో మెటీరియల్ లేకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో స్థానిక సిబ్బంది ఏదో ఒకరకంగా మేనేజ్ చేస్తూ, ప్రత్యామ్నాయమార్గాలు చూడడంతో ఆ డీటీఆర్లు మొదట్లో పనిచేసినా ఆ తర్వాత సరిగా పనిచేయడం లేదు. దీంతో కాలనీల్లో, బస్తీల్లో గంటల తరబడి కరెంట్ పోతున్నదని వినియోగదారులు డిస్కంకు ఫిర్యాదులు చేస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా చాలా చోట్ల డీటీఆర్లు పేలుతున్నాయి. స్టోర్‌లో సామాగ్రి లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక, విద్యుత్ వినియోగం పెరుగుతుంటే ఒత్తిడిని తట్టుకోలేక చాలాచోట్ల సిబ్బంది చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వినియోగదారులు తమ ఇండ్ల్లలో కరెంట్ పోయినప్పుడు ఫోన్లు చేస్తే వెంటనే స్పందించాలంటూ మింట్‌కాంపౌండ్ నుంచి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా అమలులో మాత్రం సిబ్బంది తమకు పరిస్థితులు సహకరించడం లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నా మంటున్నారు.