Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దాంతో వరుస సెషన్లలో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ఇటీవల వరుస సెషన్లలో మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ వచ్చిన మార్కెట్లకు నష్టాలతో బ్రేక్ పడినట్లయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో పాటు సూచీలు ఆల్‌టైమ్ హైకి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,481.36 వద్ద లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ మరోసారి 80,481.36 పాయింట్ల మార్క్‌ను చేరుకొని మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరింది.
ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్ పతనం ప్రారంభమైంది. ఒక దశలో 900 పాయింట్ల వరకు తగ్గింది. ఇంట్రాడేలో 80,481.36 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 79,435.76 పాయింట్లకు తగ్గింది. చివరకు స్వల్పంగా కోలుకొని.. 426.87 పాయింట్ల నష్టంతో 79,924.77 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం కిత్రం సెషన్‌తో పోలిస్తే 24,459.85 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ 24,461.05 పాయింట్ల ఆల్‌టైమ్ హైని చేరుకున్నది. అనంతరం కొద్దిసేపటికే నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నది. ఒక దశలో 300 పాయింట్ల వరకు తగ్గింది. చివరిగా స్వల్పంగా కోలుకుంది. ఇంట్రాడేలో 24,461.05 పాయింట్లకు పెరిగిన నిఫ్టీ.. 24,141.80 అత్యల్పానికి చేరింది.
చివరకు 108.75 పాయింట్ల నష్టంతో 24,324.45 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,116 షేర్లు పెరగ్గా.. 2311 షేర్లు పతనమయ్యాయి. మరో 59 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ అత్యధికంగా నష్టపోయాయి. ఇక ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో కొనసాగాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెలికాం, మీడియా, మెటల్ రంగాల షేర్లు 0.4 నుంచి 2శాతం వరకు పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పతనమైంది.