Stock Markets | న్యూఢిల్లీ, ఆగస్టు 6: స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో మదుపరులు నిండామునిగారు. గత మూడు రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు శాతం వరకు నష్టపోవడంతో మదుపరులు ఏకంగా రూ.22 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 3,274.48 పాయింట్లు లేదా 3.99 శాతం నష్టపోయింది. ఈ నెల 1న చారిత్రక గరిష్ఠ స్థాయి 82,129.49 పాయింట్లను తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ ఆ తర్వాతి నుంచి తిరోగమనబాట పట్టింది. దీంతో మంగళవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.22,02,996.27 కోట్లు కరిగిపోయి రూ.4,39,59,953.56 కోట్లు(5.24 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది.
స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు నష్టల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 1,100 పాయింట్ల వరకు పెరిగిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 166.33 పాయింట్లు నష్టపోయి 78,593.07 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 63 పాయింట్లు కోల్పోయి 24 వేల దిగువకు 23,992.55 వద్దకు జారుకున్నది.