ముంబై, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటం, విదేశీ మదుపరులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో వరుసగా ఐదోరోజూ భారీగా నష్టపోయాయి. నష్టాల ప్రారంభమైన సూచీలు చివరివరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతం ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ సూచీ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది 1,835.63 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్ చివరకు 808.65 పాయింట్లు కోల్పోయి మూడు వారాల కనిష్ఠస్థాయి 81,688.45 వద్దకు పడిపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 235.50 పాయింట్లు జారుకొని 25,014.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది.
5 రోజులు..16 లక్షల కోట్లు
సూచీల భారీ నష్టాలు మదుపరులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో ఏకంగా మదుపరులు రూ.16 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గతంలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ అంతే వేగంతో పాతాళంలోకి జారుకున్నది. ఇదే క్రమంలో శుక్రవారం బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.16,26,691.48 కోట్లు కరిగిపోయి రూ.4,60,89,598.54 కోట్ల(5.49 ట్రిలియన్ డాలర్లు)కు జారుకున్నది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 4,147.67 పాయింట్లు లేదా 4.83 శాతం నష్టపోయింది.