Stock Markets : పశ్చిమాసియా (West Asia) లో గత కొన్నాళ్లుగా కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుధవారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ (Sensex) 2,775 పాయింట్లు (3.71 శాతం) ఎగబాకి 77,300.. అదేవిధంగా నిఫ్టీ (Nifty) 815 పాయింట్లు (3.52 శాతం) పెరిగి 23,938 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. రియల్ ఎస్టేట్, ఆటో, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు 6 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో భయాన్ని సూచించే ఇండియా విక్స్ (VIX) 19 శాతం మేర తగ్గింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే, సురక్షితంగా తెరిస్తే.. రెండు వారాలపాటు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించడం, కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించడం లాంటి పరిణామాలు మార్కెట్లకు కిక్ ఇచ్చాయి.
అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఆసియా మార్కెట్లకు సైతం భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. మరోవైపు యుద్ధ భయాలు తగ్గడంతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 15.91 శాతం తగ్గి బ్యారెల్ 91.88 డాలర్లకు చేరగా.. యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఏకంగా 20 శాతం పడిపోయి 91.05 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా మంగళవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు) రూ. 8,692 కోట్ల నికర అమ్మకాలు జరపగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) రూ.7,980 కోట్ల కొనుగోళ్లు చేశారు.
ఇదిలావుంటే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలు కూడా వెలువడనున్నాయి. అదేవిధంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు.