Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. పొద్దంతా అదే ఊపును కొనసాగించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 65,461.54 వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 65,747.65 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 742.06 పాయింట్లు లాభపడి.. 65,675.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231.90 పాయింట్లు ఎగిసి.. 19,675.45 వద్ద ముగిసింది.
దాదాపు 2073 షేర్లు పురోగమించగా.. 1,223 షేర్లు క్షీణించాయి. 98 షేర్లు మారలేదు. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ 1-3 శాతం వృద్ధితో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కోశాతం శాతం చొప్పున పెరిగాయి.