MAD 3 | టాలీవుడ్లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లుగా భారీ విజయాలను అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫన్, ఫ్రెండ్షిప్, కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగిన ఈ సిరీస్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నార్నె నవీన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా ‘మ్యాడ్ 3’ ను తెరపైకి తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు, ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో పాటు కొత్త కాస్టింగ్‌ను కూడా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత చిత్రాల్లో కనిపించిన హీరోల స్థానంలో ఈసారి కొత్త యువ నటులను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త కాస్టింగ్‌లో భాగంగా ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ జేయ్ కృష్ణ, ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ పేర్లు వినిపిస్తున్నాయి. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఫ్రెష్ ఫేస్‌లతో ఈ చిత్రాన్ని రూపొందించాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమాకు ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. టైటిల్ ద్వారా కూడా ఈ చిత్రం కొత్త తరం యువత కథగా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ వంటి అప్డేట్స్ విడుదల చేసే అవకాశముంది. గత రెండు భాగాల మాదిరిగానే యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ హాస్యం, ఫ్రెండ్షిప్, కాలేజ్ లైఫ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ బ్యానర్ నుంచి వస్తున్న మరో యూత్ ఎంటర్టైనర్ కావడంతో ‘మ్యాడ్ 3’ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కొత్త కాస్టింగ్, కొత్త టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంత మేరకు క్రేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.