Epstein Files : ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కీలక అంశం ఎప్స్టీన్ ఫైల్స్. లైంగిక నేరాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి విడుదలైన వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో ప్రముఖుల పేర్లు ఉండటంతో వారిపై కూడా విమర్శల జల్లు కురుస్తోంది. న్యూయార్క్ మేయర్‌గా గత ఏడాది ఎన్నికైన జోహ్రాన్ మామ్దాని తల్లి మీరా నాయర్ పేరు కూడా ఈ లిస్టులో ఉంది.
దీంతో జోహ్రాన్‌పై అతడి మద్దతుదారులే విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూయార్క్, గ్రేస్ మ్యాన్సన్ వద్ద ఉన్న జోహ్రాన్ ఇంటి ముందు ఆదివారం సాయంత్రం అతడి మద్దతుదారులు ఆందోళన చేశారు. జోహ్రాన్‌కు వ్యతిరేకంగా మైకులో నినాదాలు చేశారు. జోహ్రాన్ తమను మోసం చేశాడని, అతడు తమకు అబద్ధం చెప్పాడని నినాదాలు చేశారు. జోహ్రాన్ తల్లి గురించి తెలిసినా అతడిని గెలిపించామని, అండగా నిలిచామని వారు ఆవేదనతో వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ తల్లి చేసిన పని సిగ్గు చేటని మద్దతుదారులు అరుస్తూ ఆందోళన చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ఉన్న మీరా నాయర్ గతంలో భారతీయురాలు. హిందీతోపాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు తీసింది. తాజాగా విడుదలైన ఫైల్స్‌లో ఆమె ఫొటోలు ఉన్నాయి.
మీరా నాయర్‌తోపాటు ఎప్స్టీన్, వ్యాపారవేత్త జెఫ్ బెజోస్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు ఫొటోల్లో ఉన్నారు. ఈ ఫొటోలు అక్టోబర్ 21, 2009 నాటివి. సెక్స్ ట్రాఫికర్‌గా ఉన్న గిస్లెయిన్ మ్యాక్స్‌వెల్ ఇచ్చిన ఒక ‘ఆఫ్టర్ పార్టీ’లో మీరా పాల్గొంది. మీరా దర్శకత్వం వహించిన అమేలియా అనే సినిమాకు సంబంధించి ప్రివ్యూ సందర్భంగా వీరంతా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్‌ను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ గత శుక్రవారం విడుదల చేసింది. వీటిలో 2,000 వీడియోలున్నాయి.