Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం రికార్డు గరిష్ఠాల వద్ద ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 67,701 వద్ద, నిఫ్టీ సైతం 73 పాయింట్లు పెరిగి 20,143 పాయింట్ల ట్రేడింగ్ షురూ అయ్యింది. రెండు సూచీలు ప్రారంభంలోనే జీవనకాల గరిష్ఠాలను తాకుతూ.. 67,706.18 పాయింట్ల సెన్సెక్స్, 20,153 పాయింట్ల వద్ద నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆ తర్వాత మార్కెట్లు అదే జోరును కొనసాగించలేకపోయాయి.
చివరకు సెన్సెక్స్ 52.01 పాయింట్లు పెరిగి.. 67,519 వద్ద.. నిఫ్టీ 33.10 పాయిట్లు పెరిగి 20,103.10 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్‌లో దాదాపు 2,302 షేర్లు పురోగమించగా, 1243 షేర్లు క్షీణించాయి. మరో 145 షేర్లు మారలేదు. నిఫ్టీలో యూపీఎల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్‌గా నిలువగా.. ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఐటీసీ, ఎల్టీఐమిండ్ట్రీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ లూజర్స్‌గా నిలిచాయి. రంగాల వారీగా ఆయిల్ అండ్‌గ్యాస్, రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కొక్కటి ఒకశాతం.. స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున లాభపడ్డాయి.