Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మార్కెట్లకు భారీ బలాన్నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 736 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ ఉదయం 76,725.27 పాయింట్లవద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,821.07 గరిష్టాన్ని తాకింది. ఒక దశలో దాదాపు 1200 పాయింట్ల వరకు లాభపడింది.
కానీ, చివరలో అమ్మకాల ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గాయి. చివరకు సెన్సెక్స్ 736.38 పాయింట్లు లాభపడి, 76,264.33 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా లాభాల బాటలోనే నడిచింది. నిఫ్టీ 231 పాయింట్లు లాభపడి 23,853.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగో, ఎటర్నల్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు పొందగా, ఐసీఐసీఐ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హిందుస్తాన్ యునీలీవర్, సన్ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ షేర్లు లాభాలు పొందగా, స్మాల్ క్యాప్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. అంతర్జాతీయంగ చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర అంతర్జాతీయంగా 82 డాలర్ల వద్ద కొనసాగింది. అలాగే ఔన్స్ బంగారం ధర 4338 డాలర్లుగా ఉంది. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ట్రంప్ ప్రకటించడం, ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పదం కుదరడం మార్కె్ట్కు లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో రూపాయి కూడా స్వల్పంగా బలపడింది. సోమవారం డాలర్‌తో రూపాయి విలువ 94.71 వద్ద కొనసాగింది.