Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలబాట పట్టాయి. గురువారం భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్, శుక్రవారం మాత్రం లాభాలతో ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 112.35 పాయింట్లు పెరిగి, 23,114.50 వద్ద ముగిసింది.
ఉదయం ట్రేడింగ్ 74,800 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమైంది. ఒక దశలో 600 పాయింట్ల లాభాలు పొందింది. నిఫ్టీ కూడా 23,200 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 200 పాయింట్లు పెరిగింది. ముందుగా మంచి లాభాలతో ట్రేడింగ్ మొదలైనప్పటికీ, చివర్లో అమ్మకాల ఒత్తిడి మూలంగా స్వల్ప లాభాలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో అనేక సంస్థలు లాభాలబాట పట్టగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాత్రం భారీగా నష్టపోయింది. 2.29 శాతం నష్టాలు చవిచూసింది. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ 1 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ 0.57 శాతం, ఇండిగో లిమిటెడ్ 0.25 శాతం, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 0.16 శాతం నష్టపోయాయి.
టెక్ మహీంద్రా లిమిటెడ్ 3.01 శాతం, ఇన్ఫోసిస్ 2.90 శాతం, టాటా స్టీల్ లిమిటెడ్ 2.81 శాతం, ట్రెంట్ 2.60 శాతం, టైటాన్ కంపెనీ 1.93 శాతం లాభాలు పొందాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4665 డాలర్లకు చేరింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. 86 పైసలు తగ్గి 93.75 వద్ద కొనసాగుతోంది.