Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల బాటలో నడిచాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1186.77 పాయింట్లు (1.65 శాతం) లాభపడి 73,134.32 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 348 పాయింట్లు (1.56 శాతం) లాభపడి 22,679.40 పాయింట్ల వద్ద ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు మార్కెట్లు లాభాలబాటలో నడవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఇరాన్ వార్‌ను త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కలిసొచ్చింది.
బ్యాంకింగ్, కెమికల్స్, మీడియా, మెటల్స్ షేర్లు ఈ రోజు లాభాల్లో కొనసాగాయి. బుధవారం ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచింది. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 1850.51 పాయింట్లు పెరిగి 73,801.07 వద్ద, నిఫ్టీ 563.95 పాయిట్లు పెరిగి 22,895.35 వద్ద కొనసాగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.70 వద్ద కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ షేర్లు 2 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.6 శాతం, లార్సన్ అండ్ టర్బో షేర్లు 3.4 శాతం పెరిగాయి. ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్లు ఏకంగా 6.7 శాతం పెరగడం విశేషం. సంస్థ సీఈవోగా ఇండస్ట్రీ వెటరన్ విల్లీ వాల్ష్ నియామకం ఇందుకు కలిసొచ్చింది. ఇండియన్ మార్కెట్‌తోపాటు ఆసియన్ మార్కెట్లు కూడా లాభాల్లోనే నడిచాయి.
ఆసియన్ మార్కెట్లు 4.6 శాతం లాభాల్లో నడవగా, యూరప్ స్టాక్స్ 600 కూడా 2.3 శాతం లాభపడింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లకు చేరింది. గత నెలలో భారత మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మొత్తంగా గత మార్చిలో 11 శాతం వరకు నష్టాలు చవిచూశాయి. గత ఆరేళ్లలో ఒక నెలలో ఈస్థాయి నష్టాలు రావడం ఇదే మొదటిసారి. ఇరాన్ యుద్ధం కారణంగానే మార్కెట్ ఈ స్థాయిలో నష్టపోయింది.