Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజు ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా పదిశాతం టారిఫ్ విధించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో రూపాయి విలువ పతనమైంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 47 పైసలు తగ్గి 85.86 వద్ద ముగిసింది. ఈ క్రమంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే బెంచ్ మార్క్ సూచీలు సోమవారం ఉదయం 83,398.08 స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,262.23 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 83,516.82 పాయింట్లకు చేరింది.
చివరకు 9.61 పాయింట్లు పెరిగి 83,442.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 0.30 పాయింట్లు పెరిగి 25,461.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,617 షేర్లు లాభపడగా.. 2,294 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.6శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.4శాతం లాభపడింది. మీడియా ఇండెక్స్ ఒకశాతం, ఐటీ, మెటల్ ఇండెక్స్ 0.7శాతం తగ్గాయి. టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, ఎటర్నల్ నష్టపోగా.. హెచ్‌యూఎల్, టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా, జియో ఫైనాన్షియల్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి.