Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 369.99 పాయింట్ల లబ్ధితో 80,369.03 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 127.70 పాయింట్లు పుంజుకుని 24,466.85 పాయింట్ల వద్ద స్థిర పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ షేర్ ఐదు శాతం పుంజుకున్నది. మారుతి సుజుకి ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లు, మార్కెట్ల అంచనాలను మిస్ కావడంతో మంగళవారం 6.42 శాతం నష్టపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ-50లో 31 షేర్లు లాభాలు గడించాయి. భారతీయ స్టేట్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎచిర్ మోటార్స్ 0.5 శాతం లాభ పడ్డాయి. మరోవైపు మారుతి సుజుకి, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, సన్ ఫార్మా సహా 19 స్టాక్స్ 4.16 శాతం వరకూ నష్టపోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ 0.92 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76 శాతం పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్స్ దన్నుగా నిలిచాయి. నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్యూ) ఇండెక్స్ 3.64 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.07, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.53 శాతం, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ 2.08 శాతం లాభ పడ్డాయి. మరోవైపు ఆటో, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ఇండెక్సులు మంగళవారం నష్టపోయాయి.సోమవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 602.75 పాయింట్లు పుంజుకుని 80,005.04 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 158.35 పాయింట్ల లబ్ధితో 24,380.80 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.