Stocks | అదానీ గ్రూపుపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో ప్రాసిక్యూటర్ల అభియోగాల నేపథ్యంలో గురువారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1961.32 పాయింట్లు (2.54 శాతం) పుంజుకుని 79,117.11 పాయింట్లకు చేరుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 555 పాయింట్లు (2.38 శాతం) లబ్ధితో 23,905 పాయింట్ల వద్ద స్థిర పడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.2 లక్షల కోట్లు పెరిగి రూ.432.55 లక్షల కోట్లకు చేరుకున్నది.
ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ లతోపాటు టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ రియాల్టీ ఇండెక్సులు దాదాపు మూడు శాతం పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్సులు 1-2 శాతం మధ్య లాభ పడ్డాయి.
ఈ నెల 16తో ముగిసిన వారానికి అమెరికాలో నిరుద్యోగిత 6,000 తగ్గి ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అమెరికాలో హెల్తీ లేబర్ పరిస్థితులు భారత ఐటీ కంపెనీలకు లబ్ధి చేకూరుస్తాయి. అదానీ గ్రూపు షేర్లు ఆరు శాతం వరకూ తిరిగి పుంజుకున్నాయి. అంబుజా సిమెంట్ ఆరుశాతం, ఏసీసీ 4 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 2.5 శాతం, ఇతర సంస్థలు 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులతోపాటు మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతం చేశాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు – ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్స్.. రికవరీకి దోహద పడ్డాయి.