ముంబై, మార్చి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్‌లో కదలాడుతున్నాయి. వరుసగా రెండోరోజూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.8.67 లక్షల కోట్లు ఎగిసింది. సోమవారం లాభాలనూ పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 1,472.35 పాయింట్లు పుంజుకోవడం కలిసొచ్చింది. ఇక మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, ఏషియన్ పెయింట్స్ తదితర షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అమితాసక్తిని కనబర్చారు.
రియల్టీ, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పవర్, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగాల షేర్లు మెరిశాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,131.31 పాయింట్లు లేదా 1.53 శాతం ఎగిసి 75వేల మార్కుకు ఎగువన 75,301.26 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,215.81 పాయింట్లు ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 325.55 పాయింట్లు లేదా 1.45 శాతం పెరిగి 22,834.30 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, భారత్‌సహా చాలా దేశాల కరెన్సీలతో చూస్తే డాలర్ విలువ బలహీనపడటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచిందని నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ.4 లక్షల కోట్లకు చేరువైంది. ఈ రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.8,67,540.05 కోట్లు పెరగడంతో మొత్తం సంపద రూ.3,99,85,972.98 కోట్ల (4.61 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు పుంజుకోగా.. సోమవారం రూ.1.67 లక్షల కోట్లు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందన్న అంచనాలు, చైనా ఉద్దీపన చర్యలు.. స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి దోహదం చేసినట్టు ట్రేడర్లు చెప్తున్నారు. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ 2.10 శాతం, స్మాల్‌క్యాప్ 2.73 శాతం పెరిగాయి.
ఓలా ఎలక్ట్రిక్ షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈలో కంపెనీ షేర్ విలువ 12.56 శాతం ఎగిసి రూ.52.80 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 15.86 శాతం పెరిగి రూ.54.35 వద్దకు వెళ్లింది. అయితే మార్కెట్ ఆరంభంలో రికార్డు కనిష్ఠాన్ని తాకుతూ రూ.46.32కు పడిపోవడం గమనార్హం. ఆర్థికపరమైన కారణాలతో సోమవారం 7 శాతానికిపైగా నష్టాలను ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఎన్ఎస్ఈలో 12.44 శాతం వృద్ధితో రూ.52.77 వద్ద షేర్ విలువ ముగిసింది. మొత్తానికి తాజా లాభాలతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,597.98 కోట్లు ఎగిసి రూ.23,289.18 కోట్లకు చేరింది.