Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ నిర్ణయం నచ్చలేదు. ఫలితంగా శుక్రవారం ఐదు సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేటు 6.5 శాతం యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. కానీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 నుంచి 6.5 శాతానికి కుదించేసింది. నెమ్మదించిన ఆర్థిక వృద్ధి రేటును పరుగులెత్తించేందుకు బ్యాంకులకు అవసరమైన నిధుల లభ్యత కోసం క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)లో కోత విధించింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 56.74 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 81,709.12 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 81.925.91 పాయింట్ల నుంచి 81,506.19 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 30.60 పాయింట్ల పతనంతో 24,677.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 24,751.05 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, 24,620.50 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.
ఎన్ఎస్ఈ-50లో 32 స్టాక్స్ నష్టాలతోనే ముగిశాయి. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ 1.51 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహా 18 స్టాక్స్ 3.21 శాతం వరకూ లాభ పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 0.45 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 0.82 శాతం లాభాలతో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్యూ బ్యాంకు, కన్జూమర్ డ్యూరబుల్స్, ఓఎంసీ, హెల్త్ కేర్, ఫైనాన్సియల్స్ లాభాలతో ముగిస్తే, మిగతా ఇండెక్సులు పతనం అయ్యాయి. జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రకటించడంతో ఆటో స్టాక్స్ పుంజుకున్నాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, ఐటీసీ ప్రధానంగా లాభ పడ్డాయి. అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ పతనం అయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.84.69 లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 71.62 డాలర్లు, ఔన్స్ బంగారం ధర 2660 డాలర్లు పలికాయి.