ముంబై, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షాకిచ్చారు. అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను పెంచడం, అక్కడ నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్టు నివేదిక విడుదల కావడంతో విదేశీ మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో వరుస లాభాలకు బ్రేక్పడినట్టు అయింది. బ్లూచిప్ సంస్థల్లో భారీగా క్రయవిక్రయాలు జరగడం, విదేశీ పెట్టుబడిదారులు 200 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సూచీలకు నష్టాలనే మిగిల్చింది.
ఒక దశలో 750 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 694.96 పాయింట్లు లేదా 1.13 శాతం నష్టపోయి 61,054.29 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 186.80 పాయింట్లు(1.02 శాతం) తగ్గి 18,069 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ ద్వయం భారీగా నష్టపోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.80 శాతం నష్టపోగా, హెచ్డీఎఫ్సీ 5.57 శాతం పతనం చెందాయి. వీటితోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రాఅండ్మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎన్టీపీసీలు నష్టపోయాయి. కానీ, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, నెస్లె, ఐటీసీఎ, ఎల్అండ్టీ షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు ఒక్కశాతానికి పైగా కోల్పోగా..కమోడిటీ, టెక్, ఐటీ, టెలికమ్యూనికేషన్ సూచీలు నష్టపోయాయి. మరోవైపు, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు పెరిగాయి.