Prakash Raj | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ చుట్టూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక, కథా నేపథ్యం, షూటింగ్ అప్డేట్స్ వంటి అంశాలపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో గత కొద్ది రోజులుగా ఓ నెగెటివ్ ప్రచారం జోరందుకుంది. సెట్స్‌లో గొడవలు జరిగాయని, ఒక స్టార్ నటుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని, దర్శకుడు–నటుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది.
అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా స్పందించడం విశేషం. తాను ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. అసలు తన సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని ఎలా ప్రచారం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ ఫ్యాక్టరీల్లో కట్టుకథలు సృష్టించడం మానుకోవాలని కూడా ఘాటుగా స్పందించారు.ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఈ స్పష్టతతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు రిలీఫ్ ఇచ్చింది. ప్రభాస్ లాంటి భారీ స్టార్ సినిమాలో ప్రకాష్ రాజ్ వంటి అనుభవజ్ఞుడైన నటుడు ఉండటం సినిమా బలాన్ని మరింత పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక చిత్ర యూనిట్ ఇప్పటివరకు రూమర్లపై పెద్దగా స్పందించకపోయినా, షూటింగ్ మాత్రం ప్లాన్ ప్రకారమే సాగుతోందని సమాచారం. త్వరలోనే ప్రకాష్ రాజ్ సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ‘స్పిరిట్’ చుట్టూ నెలకొన్న హైప్ చూస్తుంటే విడుదల సమయానికి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రకంపనలు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. నెగెటివ్ ప్రచారానికి బ్రేక్ పడిన ఈ తరుణంలో, సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో చూడాల్సి ఉంది.