Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజు బుల్ పరుగులు తీసింది. ఒకవైపు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, మరోవైపు రాజకీయ రంగంలో సానుకూల పరిణామాలు ఏర్పడటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1714 పాయింట్ల లబ్ధితో 76,795 పాయింట్ల జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 23,300 పాయింట్ల రికార్డును దాటి, తిరిగి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సయమానికి సెన్సెక్స్ 1619 పాయింట్ల లబ్ధితో 76,693 పాయింట్లు, నిఫ్టీ 469 పాయింట్ల లాభంతో 23,290 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ-ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టైటాన్, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్.. రెండు నుంచి ఐదు శాతానికి పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.28 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2.16 శాతం వృద్ధి చెందాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 3.4 శాతం, నిప్టీ మెటల్ షేర్లు రెండు శాతం, బ్యాంక్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున పెరిగాయి. మరోవైపు అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.83.38 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 79.92 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.