Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ నష్టాల్లో ముగియగా.. నిఫ్టీ స్వల్పంగా లాభాలపడింది. వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. విదేశీ మదుపరుల అమ్మకాలు, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దాంతో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 66,531 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో 66,559 పాయింట్ల వరకు చేరి చివరకు 29.07 పాయింట్ల నష్టంతో 66,355.71 వద్ద ముగిసింది.
నిఫ్టీ 8.25 పాయింట్ల లాభంతో 19,680.60 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ మరోసారి 19,700 పాయింట్లను తాకింది. దాదాపు 1,686 షేర్లు పురోగమించగా.. 1,754 షేర్లు క్షీణించాయి. 135 షేర్లు మారలేదు. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లు నిలువగా.. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో నష్టపోయాయి. సెక్టార్లలో, మెటల్, పవర్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున పెరిగాయి.